Wednesday, 15 February 2017

కవిత ..ఎదురుచూపు....13-03--2017..

ఎదురు చూస్తూనే ఉన్నాను నేను నీ కోసం

వెన్నెల కోసం ఎదురుచూస్తున్న చకోరంలా.

పురివిప్పి నాట్యం చేయాలని మయూరం

మొయిలు కోసం ఆశగా ఆకాశం వంక చూసినట్లు..

ఆశతో  రహదారిలో రంగవల్లులు దిద్దుతూ

ఆ వంకే చూస్తున్నా!

విన్పిస్తున్నది  సుతారంగా గలగలలాడుతున్న

బండికున్న ఎద్దుల మువ్వలు సవ్వడి

మోసుకొచ్చింది గాలి సన్నని ఏదో రాగాన్ని....

ఓహో!నీవు వస్తున్నావని

తెలిపే మలయమారుతం...

తేలియాడాను ఆనందడోలికల్లో..

నా మనసు లో గూడు కట్టుకున్న

ప్రణయపాత్రను నీ ముందుంచే..

రాగిణి ని  కావాలని..

ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన..

శుభ ఘడియ రాబోతోందని..

నయనాల్లో ఆనందబాష్పాలు...

దీపకళికల్లాగా రాలుతున్నాయి...

డా. శ్యామలగడ్డం...15-02-2017....

Friday, 10 February 2017

గురువులకు వందనం....

గురువులకు వందనం
---------------------------
కృష్ణవేణి టీచర్ కష్ఠపడి మాకు బోధించిన పాఠాలతో,
సబిత టీచర్, సత్తెమ్మ టీచర్ల క్రమశిక్షణతో,
ప్రధమ గురువైన మా అమ్మ ఆలనా, పాలనతో
బాల్యంలో జ్ఞానబీజం పడింది..
నల్గొండ తెలుగు కళాశాలలో మా మాష్టారు
రాధాకృష్ణమూర్తి గారి పాండిత్యంతో,
శివరామకృష్ణగారి వ్యాకరణ బోధనతో,
నరసింహ మూర్తిగారి ప్రబంధాల సొగసుల ప్రబోధంతో
నా విద్యా వృక్షం మొక్కగా ఎదిగింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో
బిరుదురాజు రామరాజు గారి రామాయణపు పాటలతో,
డా.సి. నారాయణరెడ్డిగారి అమృతవాక్కులతో,
నాయని కృష్ణకుమారిగారి కవితామాధుర్యంతో
గోపాలకృష్ణారావుగారి వాత్సల్య బోధనతో,
కులశేఖరరావు గారి కళాత్మక ప్రసంగాలతో,
రవ్వా శ్రీహరి గారి సంస్కృత ప్రతిభాసంపన్నతతో
ఎస్వీ రామారావుగారి ఆత్మీయబోధనతో,
నా విద్యాకుసుమం రేకులు విప్పుకుని
రేఖను మార్చి, బంగారుపతకాన్ని
తెచ్చిపెట్టింది..
బెనారస్ (కాశీ) విశ్వవిద్యాలయములో
త్రివిక్రమయ్యగారి త్రివిక్రమ స్ఫూర్తితో
విశ్వనాథ్ గారి విలువైన సలహాలతో
విశ్వనాధుడు కొలువైన, అన్నపూర్ణ,
విశాలాక్షి సన్నిధిలో, పి. హెచ్ డి పట్టాను
సాధించిన నాజీవితం ధన్యమైంది...
ఆ గురువుల బోధనలతో సార్ధకమైన
నా జీవితం, శ్రీ పద్మావతీ మహిళా కళాశాలలో
నా గురువులు ప్రసాదించిన జ్ఞానంతో,
నేను గురువునయ్యే అవకాశం వచ్చింది..
నా విద్యార్ధులను మాగురువుల్లాగే
క్రమశ్క్షణతో, విజ్ఞానంతో, ఎదిగేలా
చేస్తున్నందుకు కించిత్ గర్వంగానూ
ఎంతో సంబరంగానూ ఉంది........
పైన తెలిపిన గరువులందరికీ పేరు, పేరునా
శిరసు వంచి పాదాభివందనం ముఖపుస్తకం ద్వారా
తెలియ చేస్తున్నాను........
డా. జి. శ్యామల...........

Sunday, 5 February 2017

లోటులేదు గజల్..05-02-2017

మెహఫిల్-ఎ-ముషాయిరా......05-02-2017...

మేఘాలే   కమ్ముకుంటె   వర్షాలకి   లోటులేదు

మయూరాలె  నర్తించిన  జలదాలకు  లోటులేదు

అక్షరాలె జడివానగ కురుస్తుంటె కావ్యమవును

చదువుకునేవారుంటే   కావ్యాలకి   లోటులేదు

కూడులేక,  నీడలేక  దగాపడ్డ.  వారెందరొ

పాలకులే తలచుకుంటె మరి వారికి లోటులేదు

పాటలకూ పల్లవులే. ప్రాణముగా సాగునుగా

గానగంధర్వులుండగ. మైమరపుకి లోటులేదు

నీలిమేఘశ్యామునిగా వలపువాన కురిపించగ

మానినులకు  మనసులోన  సంతృప్తికి లోటులేదు

డా. శ్యామలగడ్డం....05-02-2017...