Monday 10 September 2018

కావాలీ.గజల్...

మనసులోని మంచియొకటి వెలుగుదారి కావాలీ /
మాటలోని మధురిమలో మమత ఒకటి కావాలీ //

ఆకసాన చందమామ వెన్నెలొకటి చాలదులే /
తారలతో చందురూని వెలుతురొకటి కావాలీ //

వనములోన సుగంధాల విరిజల్లులు ఎందుకనీ /
మనిషిలోన మరువలేని సుగుణమొకటి కావాలీ //

వైభవంగ ఉండాలని తపనపడుట ఎందుకనీ /
ఉన్నంతలొ సంతృప్తిగ గడుపుటొకటి కావాలీ //

పగలురేయి ఉండునులే అవనిపైన ఓ శ్యామా /
జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యమొకటి కావాలీ //
---------------------------------------------------------------------
డా. జి. శ్యామల-------11-09-2015

Wednesday 22 August 2018

అక్షర సమస్యాపూరణం...

అక్షర సమస్యా పూరణం...డా.శ్యామలగడ్డం..21-08-2018...
±++++++++++++++++++++++++++++++++++++++

జలప్రళయము సంభవించె కేరళమునందునను
వరదలందున సర్వము పోగొట్టుకొనిరి జనులు,
ముక్కంటి  తలచుకొనగ  ఆదుకొనుహస్తములను
వరదవచ్చి జనులకెల్ల వరములొసగునట!

పద్యం...దత్తపది...వర్ణన...

జలవిలయము...వర్ణన...

ఆ.వె.  జలము ప్రాణ ధార జనులకు యెంచగా,
          కలము  కత్తి యౌను కవుల యెదకు,
         జలవిలయము కలుగగ,జాలి గొలుపగను..
          ప్రజలు  మౌను లయిరి పలుకు లేక!

వర్ణన....జలవిలయము....22-08-2018...డా.శ్యామల..



తెలుగు సాహిత్య సుధాంబుధి....వారు ఇచ్చిన దత్తపది...

దత్తపది...గంగ, యమున, గోదావరి, కృష్ణ ...
22-08-2018...రచన,  డా.శ్యామల  గడ్డం...

దత్తపది....

  తే.గీ. భవుని కృప చేత  దిగినది  భవ్య గంగ
           యముని చెల్లెలై అలరారి యమున వెలసె..
            నాసికమ్ము  గోదావరి నామ పుట్టె
             పంట లొసగగ కృష్ణమ్మ  పరుగులిడెను..!

డా.శ్యామల...22-08-2018...

Monday 9 July 2018

గజల్....06-07-2018

చిత్రానికి గజల్ రచన- చిరు యత్నం..06-07-2018...
++++++++++++++++++++++++

అరమోముతొ  చందురునీ హాసములో చూపుదువే...
ముద్రలతో  ఆంగికములు ,అభినయములు  చూపుదువే..

రంగస్థలమున  రాగిణిగ హొయలెన్నో  కురిపించీ...
అవని పైన అప్సరసా...అతిశయములు  చూపుదువే....

నటరాజు ను మెప్పించీ మోక్షమునే కోరుదువో..
సిరిమువ్వలు  ఘల్లుమనగ  సందడులూ చూపుదువే...

రంభ ఊర్వశి మేనక లు నీముందూ బలాదూరె...
రసానందము గొలుపగ , లలిత కళలు చూపుదువే.

శ్యాముమురళి విన్నంతనె  నాగిని వలె ఆడుదువే...
సరిగమలకు సానపెట్ట  సంగతులూ చూపుదువే...

డా.శ్యామలగడ్డం...06-07-2018

Thursday 21 June 2018

సమీక్ష...

గజల్ సదస్సు సమీక్ష...విమర్శ.....

డా. శ్యామలగడ్డం....21_06_2018....

±++++++++++++++++++++

జూన్...అంటే ఈ నెల 10, 11 తేదీలలో విజయవాడ లయోలా కాలేజీలో, కళాభారతి ఆవరణలో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ సంస్కృతి సృజనాత్మక సంస్థ, మరియు జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో గజల్ సదస్సు జరిగింది.

తెలుగు గజల్ అంటేనే  తెలుగు సాహిత్య ప్రక్రియగా తెలియనట్లు భావించేవారికి ఈ సదస్సు విషయం ఆశ్చర్యంగా ఉండొచ్చు.....కానీ తెలుగు గజల్ ప్రచారం వ్యాప్తిని తమ భుజస్కంధాలపై వేసుకున్న  జ్యోట్గాకు మాత్రం ఇది కొత్త కాదు....దీనికోసం ఆంధ్ర.ప్ర.ప్రభుత్వాన్ని ఒప్పించి సహకరించేలా చేయడమే జ్యోట్గా సాధించిన మొదటి విజయం....

గజల్ అంటే తెలంగాణ లో ఉర్దూ సాహిత్య వాసన కలిగిన వారికి  తెలుసు కానీ, ఆంధ్రాలో తెలిసినవాళ్ళు తక్కువే అనుకుంటున్నాను...ఆ తక్కువైనా...ఆవిధంగా తెలిసేలా చేసినవారిలో జ్యోతిర్మయి ఒకరు...గజల్ గాయనిగా, అన్నిచోట్లా ప్రదర్శనలిస్తూ,గజల్ పై సరియైన అవగాహన కల్పించడానికి సదస్సు తో సన్నధ్ధులయ్యారు...‌
ఒక చిన్న కార్యక్రమం తలపెట్టాలంటేనే ఎంతోమంది సహాయసహకారాలు అవసరమవుతాయి...
జ్యోట్గా సభ్యులు సహకారంతో , మరికొంతమంది సభ్యులతో ఈ కార్యక్రమం చేపట్టి విజయం సాధించారని చెప్పవచ్చు......

ఇక సదస్సు విషయానికి వస్తే....

ప్రారంభోత్సవం 10 వ తేదీన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమయ్యింది... సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ గారు ముఖ్య అతిథిగా, తక్కువ సమయంలో నే ఉపన్యాసాలు ముగిసాయి... జ్యోతిర్మయి గారు,పెద్దలకు, ఎంతో దూరాలనుండి వచ్చిన సభ్యులకు
స్వాగతాంజలి సమర్పించారు..సదస్సు ఉద్దేశ్యము, లక్ష్యము తెలిపారు..సదస్సు కార్యదర్శి అబ్దుల్ వాహెద్ గారు కూడా సదస్సు గురించి తెలియచేసారు...

తరువాత వేరే హాల్ లో సదస్సు విభాగాలు మొదలయ్యాయి... జ్యోతిర్మయి గారు సభ్యులందరినీ శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వర్ రావు గారికి పరిచయం చేసారు..
సభ్యులందరూ.. దాదాపు బాధ్యతాయుతమైన ఉద్యోగాలను నిర్వహిస్తూ , అచ్చంగా గజల్ గురించి ఆసక్తితో తెలుసుకోవాలని వచ్చినవారే....

మొదటి ప్రసంగం...రెంటాలవారిది...గజల్ స్వరూపం..

గజల్ అంటే యేమిటి, రూపం ఏమిటి, సారం ఏమిటి?
రదీఫ్, ఖాఫియా అంటే ఏమిటి? నిర్మాణం ఎలా ఉండాలి..గతులు ఏమిటి....మిత్రా, మక్తా, తకల్లుస్..గురించి సవివరంగా చెప్పారు...

తరువాత సెషన్ లో  గజల్ చరిత్ర, గానయోగ్యత
గురించి పత్తిపాక మోహన్ గారు చెప్పారు....పార్టీ నుండి, అరబ్బీ నుండి, ఉర్దూ నుండి తెలుగులోకి గజల్ ప్రయాణాన్ని ప్రస్తావించారు......

ఉర్దూ గజళ్ళ మాధుర్యాన్ని, లాలిత్యాన్ని..సులలితమైన పదజాలంతో వివరించారు.అంతేకాకఉర్దూ గజల్ ఛందస్సును , దాని సౌలభ్యాన్ని చెప్పారు.తెలుగులో ఛందస్సు పరంగా కొంత వెసులుబాటు తగ్గుతుంది అన్నారు..దానికి కారణం,మంచి తెలుగు అజంత భాష కావడమే..అన్నారు...‌మధురమైన ఉర్దూ గజల్స్ ని వినిపించారు....

10వతేదీ రాత్రి 13 మందితో గజల్ ముషాయిరా, ప్రారంభ సభ జరిగిన వేదికపైన  అత్యంత ఆనందంగా జరిగింది...
ముషాయిరాను చూసి . ప్రేక్షకులు కూడా  ఆనందాన్ని అనుభవించారు....

11 వ తేదీన గజల్ గానయోగ్యత- చమత్కారం అన్ని అంశంపై మాట్లాడవలసిన పెన్నా శివరామకృష్ణ గారు ఆరోగ్యరీత్యా రానందువలన ఆ విషయంపై రెంటాల మాష్టారు మాట్లాడారు....గజల్ పుస్తకాల్లోనుండి ఉదాహరణలు చూపి మరీ ప్రసంగాన్ని కొనసాగించారు...
ఉర్దూ గజళ్ళ లోని చమత్కారాన్ని చెప్పారు..ఉర్దూ రాదంటూనే....

తరువాత సెషన్ లో  ఎండ్లూరి సుధాకర్ గారు నవీన తెలుగు గజల్ గురించి మాట్లాడారు...సభ్యులంతా
తమను తాము మరచిపోయి, ఏ ఒక్క విషయమైనా మనం మిస్ అవుతామేమో అన్నంత శ్రద్ధగా విన్నారు(ము) ...
గమ్మత్తయిన విషయమేమిటంటే...వారు స్వయంగా వారి అనుభవాలు చెబుతుంటే....గజల్ విషయంపైనే మాట్లాడుతున్నారా...లేదా...అనే విషయాన్ని కూడా మరిచిపోయారు సభ్యులు .....అపరిమితమైన వాగ్ధాటి...
ఇన్ని విషయాలు ఎలా గుర్తున్నాయబ్బా! అనిపిస్తుంది....

రెంటాల మాస్టారి వినయం, విషయంపై పట్టు, తనకేెమీ తెలియదంటూనే గజల్  సముద్రంలోని ఆణి ముత్యాలు అందించారు.....

సుధాకర్ గారి ప్రసంగంతో గుండెనిండా సంతృప్తిని, సంతోషాన్ని నింపుకుని హాల్ బయటకు వచ్చాము....

ప్రసంగాలు మధ్యలో చల్లాగారి, చల్లా గజళ్ళు గురించి
వాహెద్ గారి మత్తకోకిల గురించి, రెంటాల గారి మంత్రశాల గురించి, ఎం.బి.డి.శ్యామల గారి ఆలాపన పుస్తకం గురించి
పెన్నా గారి సల్లాపం గురించి గజల్ పుస్తక సమీక్షలు జరిగాయి.‌‌...అందరూ బాగా చెప్పారు...

ముగింపు కార్యక్రమాలను మొదటి సభావేదిక పైన చిరుజల్లుల పరీమళాలతో ఆనందంగా జరిగింది...

గజల్ గుల్దస్తా..50 మంది గజల్ కవులు రాసిన సంకలనం
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ గారి చేతులమీదుగా ఆవిష్కరింపబడింది...ప్రతీ ఒక్కరికీ సన్మానం జరిగింది...గజల్ రచనా పోటీలో విజేతలయినవారికి బహుమతులు ఇచ్చారు..శీర్షిక పోటీలో గెలుపొందిన వారికి బహుమతి ఇచ్చారు.....అందరూ చిరునవ్వులతో,గుండెనిండా సంతోషాన్ని నింపుకొని, స్నేహితులతో వీడ్కోలు తీసుకుని ఎవరి గూటికి వారు చేరారు...

గజల్ రచన వ్యాప్తి చెందాలంటే..నా అభిప్రాయం..

మనం రాసిన గజల్ గాయనీ, గాయకులు ఆలపిస్తేనే
రచనకు గుర్తింపు వస్తుంది.లేదంటే గజల్ కవులు మాత్రమే చదువుతారు.

50 మంది గజల్ షేర్లలో ఒక్కొక్క షేర్ తీసుకుని గాయకులు ఆలపించాలి, కచేరీలలో...

గాయనీ గాయకులు కూడా రాసేవారితో పాటు ఎక్కువ మంది రావాల్సి ఉంది...

ముషాయిరాలు నడుపుతూ నే ఉండాలి.....

++++++++++++++++

చివరగా చిన్నమాట....ఎంతో దూరాల్నుండి సదస్సు కోసం వచ్చినవారిని , వారి పరిచయాన్ని వారు చేసుకునే అవకాశం ఇవ్వాలి...

సదస్సు చివరన సదస్సు పట్ల సభ్యుల మనోగతాన్ని సభలో వివరించే (అది ఒక రెండు నిమిషాలు అయినాసరే) అవకాశాన్ని అందివ్వాలి.....

ఇవి నాకు వ్యక్తిగత అభిప్రాయాలు.....

వసతి, భోజనం సౌకర్యాలు చాలా బావున్నాయి...

ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలకెత్తుకుని సక్రమంగా నడిపిన
స్నేహితురాలు జ్యోతిర్మయి మళ్ళ గారికి హృదయ పూర్వక నమస్సలతో, మరొక సదస్సుకు ఆశగా ఎదురు చూస్తూ...‌
..............

సమీక్ష ఆలస్యంగా రాసినందుకు మన్నించమంటూ....

  మీ

మిత్రురాలు,

డా.శ్యామల గడ్డం...‌....

21-06-2018...

Monday 18 June 2018

"న్యాయమా"...గజల్....గజల్ రచన...
డా.శ్యామల గడ్డం.....18-06-2018....

ప్రేమ తడిసిన మనసునందున విషము చిమ్ముట  న్యాయమౌనా...

వలపు తలపను(తలపు+ అను) నావ నీటను ముంచివేయుట న్యాయమౌనా...

ఎన్నడో ఒక చూపు బాణం విసిరి వేస్తివి ప్రేమ మీరగ.

నిన్న నే ఒక తేనె కత్తిని మదిని దింపుట న్యాయమౌనా..

మూసివేసిన రెప్పవెనుకా ద్వేషమెందుకు రగిలిపోయెను..

Thursday 31 May 2018

గజల్...30-05-2018

గజల్ ముషాయిరా......రచన..డా.శ్యామల గడ్డం.....30-05-2018..
+++++++++++++++++++++++++++++++++

కలలోన నీ రూపె  కదులుతూ ఉంటుంది..

మంత్రమై నీపేరు నిలుస్తూ ఉంటుంది,...

నీ ఊహ క్షణమైన కలిగితే చాలులే..
నా మనసు జడముగా మారుతూ ఉంటుంది....

నీ కనుల భాష్యాలు చదివితే చాలులే..
నా హృదయ రాగమూ పలుకుతూ ఉంటుంది..

ఆమనీ కోయిలా  పాడితే తీయగా,
నీ గీత మాధురీ తడుముతూ ఉంటుంది..

నీ వలపు తలపులే తలుపులే తీయగా..
మాటలే కవితయై పారుతూ ఉంటుంది..

విరహాగ్ని పొగలోన నీ రూపె కనబడదు.
ప్రేమతో వర్షించ తొలగుతూ (పొగ)ఉంటుంది...

డా.శ్యామల గడ్డం.....30-05-2018