ముషాయిరా గజల్..రచన. డా..శ్యామలగడ్డం..14-07-2016..
స్వచ్ఛమైన ప్రేమ తెలిపె మనసెక్కడ దొరుకుతుంది
ఏ ఫలమూ ఆశించని చెలిమెక్కడ దొరుకుతుంది
కనులనిండ నీరుండగ కనురెప్పలు బరువవులే
అశ్రువులను దాచుకోను చోటెక్కడ దొరుకుతుంది
పచ్చకోక కట్టుకున్న భూమాతకు సంబరమే
నీలాంబరి నందుకోగ మెట్టెక్కడ దొరుకుతుంది
మనసు గుచ్చు మాటలతో నొచ్చుకుంటె అది మేలా
సరసమైన సంభాషణ తీరెక్కడ దొరుకుతుంది
కులమతాల గోడలన్ని తీసివేయ పాటుపడగ
ఏ వర్గానికి చెందని మనసెక్కడ దొరుకుతుంది
మనసు మూగదయినపుడూ భాషకూడ రాకుండును
రాగసుధలు కురిపించే ప్రేమెక్కడ దొరుకుతుంది
హృదయములో వేదనంత వెల్లువగా పొంగుతోంది
మనసుగోడు వినేందుకు చెలిమెక్కడ దొరుకుతుంది
డా. శ్యామలగడ్డం...14-07-2016...
No comments:
Post a Comment